Wednesday, December 7, 2011

సూర్య పత్రికలో గంటేడ గౌరునాయుడు కధల పరిచయ వ్యాసం - రామతీర్ధ

ఉత్తరాంధ్రలో నదులెక్కువ. కథకులూ ఎక్కువమందే. శ్రీకాకుళం ప్రాంతాన్ని కథలకెత్తిన బతుకు గంప గంటేడ గౌరు నాయుడు . 1997లో వెలువడిన గౌరు నాయుడు కథాసంపుటి ‘ఏటి పాట’కు ప్రశంసగా వెనుక పేజీలో ఇలా అన్నారు కారా మాస్టారు: ‘ఆంధ్ర దేశానికి ఓ అంచున ఉన్నాయి మేరండి, కురుపాం కొండలు. ఆ ప్రాంతాల జన జీవనాన్ని నిబద్ధతతో చిత్రిస్తాడు గౌరు నాయుడు. అందుకే ఆయన కథలంటే మీకులానే నాకూ ఇష్టం’. రెండు దశాబ్దాలుగా గౌరు నాయుడి నిబద్ధత కొనసాగుతోంది కథలుగా, కవితలుగా, దీర్ఘ కవితలుగా, గీతాలుగా. ఈ ప్రయాణంలో ‘ఏటి పాట’, ‘కళింగోర’, ‘గీతాంజలి’, ‘నాగేటి చాలుకు నమస్కారం’, ‘పాడుదమా స్వేచ్ఛా గీతం’, ‘నాగలి’, ‘నదిని దానం చేశాక’, ‘ఒక రాత్రి- రెండు స్వప్నాలు’ గంటేడ కలంనుంచి వెలువడ్డాయి. అభివృద్ధి పేరిట విధ్వంసం గ్రామ జీవన మూలాలను నిర్హేతుకంగా తుడిచి పెడుతున్నప్పుడు, నమోదయ్యే జనుల పచ్చి కోపం, వెచ్చని వెతలు సహజంగా గౌరునాయుడు చెప్పే కథలలో బలంగా కనుపిస్తాయి.

1997లోనే గౌరునాయుడి కథల్లో మరో ప్రముఖ కథకుడు అట్టాడ అప్పల్నాయుడికి క్షతగాత్ర గానం వినిపించి, తన సహ రచయిత కథల్లో నాగావళీ తీర సాంస్కృతిక స్పర్శ పుష్కలంగా ఉందన్నాడు. వాడ్రేవు చిన వీరభద్రుడు టాగూర్‌ ‘ఫ్రూట్‌ గేదరింగ్‌’ జ్ఞాపకాలతోనో ఏమో, గౌరునాయుడనే కొంద దేశపు కొండదేశపు బొట్టెడు చింతచెట్టెక్కి దులుపుతుంటే జల జలా రానిన పండు వానలో సాగిద్దాం ఇక మన ఫల సేకరణ అంటూ ‘ఏటి పాట’కు హైలో హైలెస్తా పాడాడు.‘ఏటి పాట’ కథా సంపుటిలో ‘బడిసాల’ కథలో పిల్లలకు చదువుకోను సరైన బడి కూడా లేని గ్రామంలో పెద్ద తరాల్ని ఎదిరించి, కొత్తతరం ఎలా కొత్త పూరిపాక కడతారో, ఆ బడిలోంచి చదువుకునే పిల్లల ఆ,ఆ,ఇ,ఈల రాగం ఎలా వినిపిస్తుందో కథనంలో బిగి తగ్గకుండా చెప్పాడు కథా రచయిత.

ప్రతిఘటన, పరిరక్షణ జీవన సూత్రంగా, పిల్లలు బొంగరం జ్యాలీ మీంచి గిర్రున వదిలి, రక రకాల విద్యలు చూపిన రీతిన ‘జీవన సూత్రం’ కథలో పిడుగు పడి, సహజంగా గొడ్డు మేపుకునే గుంటడు కళ్ళుమూస్తే, పంచనామా కోసం వచ్చిన ఎసై్స- అందరూ కలిసి చంపేసి, పిడుగు పడిందని కథలు అల్లుతున్నారని, అయిదు వేలిస్తే హత్య విషయం సాగదీయకుండా తాము సంతృప్తి చెంది వెళ్ళిపోతామన్న దానికి కథలో పాత్ర ఇలా ఈసడిస్తుంది: ‘కోమిటోడ్ని చూసి సొంటి కొమ్ము అడిగిందట నక్క. పల్లెటూరోలంత బైగుగాళ్ళని ఖాకీ బట్టలు సూపించి, కళ్ళెర్ర జేస్సి బెదిరించి బుక్కియ్యాలని సూత్రుండు గావాల’.

శ్రీకాకుళం జీవభాష రాయగలిగిన మట్టి మూలాల మనిషి గౌరునాయుడు- లంచగొండి ఎసై్సకి, అలాగే అని ముందు ఒప్పుకున్న గ్రామస్థులచే ఆఖర్న ఆంతరంగికంగా సామూహిక సత్కార శిక్ష అమలు చేయిస్తాడు. తమ ప్రయోజనాలు అన్యాయమైపోయే చోట ప్రతిఘటన- పరిరక్షణ జీవ సూత్రంగా, పాఠకులు నమ్మగలిగే తీరున గౌరునాయుడు కథ నడిపిస్తాడు.రైతు జీవన రాయబారి గంటేడ గౌరునాయుడు. గొప్ప జీవన మర్యాదల్ని రైతులకు ఆపాదించి కవిత్వం రాయగలడు. ‘నాగలి’ దీర్ఘ కవిత, వ్యవసాయ యుగం మానవ ఇతిహాసంలో ఆరంభమైన మూలాన్నించి మొదలైన ఈ పనిముట్టు, ఇవాళ పని లేక గోడకు వేలాడుతుంటే, చూసిన ఇంగ్లీషు మీడియం మనవడి ప్రశ్న‘అదేమిటది?’. అక్కడే మొదలవుతుంది గౌరు నాయుడు రచన ‘నాగలి’. ఇందులో ‘ఆసర సాల’ను కవి పరిచయం చేస్తాడు.

‘ఆసర సాల/ కొత్త వ్యవసాయ పనిముట్ల కొలువు/ రైతన్నల నిత్యావసరాల నెలవు/ నాగలి/ నొల్ల/ సరుగుడు/ బండి/ కొడవలి/ గొడ్డలి/ బొడిగి/ పార/ కొంటికర్ర/ పువ్వుల కొరడా/ ములుగర్ర/ వ్యవసాయ పనిముట్ల ప్రయోగశాల ఆసర సాల’.అంటూ గ్రామీణ జీవన పరికరాలను తయారుచేసే ఆసరసాల ఆచారి (కమ్మరిపని చేసే వ్యక్తి)ని స్మరిస్తాడు. మారిపోయిన వ్యవసాయ విధానాలకు పాతపద్ధతులపై అలవాటుతో జీవించే రైతు గుండె కోత ‘నాగలి’ కవితలో వివిధ దశలలో చిత్రిస్తాడు. అలతి అలతి మాటలతో ఆదిమ కాలంనుంచీ వస్తున్న కథను కవిత్వంగా చెప్తూ, రైతులోకానికి పౌర వందనం చేస్తాడు ఉప్పొంగే ఆత్మగౌరవంతో, ‘నాగలి’ ఆఖరున.

‘భూ గోళం/ రైతు వీరుని బిగిసిన పిడికిలి/ ఆకాశం/ రైతు ఇల్లాలు అలికి ముగ్గేసిన వాకిలి/ భూమ్యాకాశాల నడుమ/ అవిశ్రాంత/ భ్రమణ గీతం నాగలి/ ఆ నాగలి/ తొలి పొద్దును/ నుదుట దిద్దుకుని/ ఎదురు చూస్తోంది చాలు కోసం/ నమ్మిన నేల కోసం’.ఏ ఆసర సాలనైతే పై దీర్ఘ కవితలో ప్రస్తావించి ప్రాణప్రతిష్ఠ చేశాడో, అదే ఇతివృత్త నేపథ్యంగల కథ ‘ఆసర సాల’ను తన మరో కథా సంపుటి. ‘ఒక రాత్రి రెండు స్వప్నాలు’లో నమోదు చేస్తాడు గౌరు నాయుడు. వీరాచారి ఇందులో కమ్మరి పనులు చేసే వ్యక్తి. పనులు యంత్రాలకు చెంది, సంప్రదాయాక పనిముట్లకు పెద్దగా అవసరం లేని క్షీణ దశలో, గ్రామంలోని పేదజనం మల్లే- వారి పనిముట్ల తయారీ కేంద్రం దిక్కులు చూస్తోంది పనుల్లేక. ఊర్లో ఉండడమా, ఊరు వదిలి కొడుకు మాట మీద, పొలాలు భవంతులవుతున్నా పార్తీపురానికి, నర్సిపురానికే పోవడమా అన్న సందిగ్ధత ఇసుమంతైనా లేకుండా ఉన్న పనితోనే ఆత్మ నిగ్రహంతో ఉంటాడు వీరాచారి.

ఆసర సాల వైభోగాలు గౌరునాయుడు చెప్తే వినాల, వీరాచారి జ్ఞాపకాలుగా. ‘ఊరందరికీ తల్లో నాలిక, కంసాలోడికీ- కాపోడికీ ఉన్న లంకి, నాగలికీ- నర్రుకీ ఉన్న లంకిరా’ అని నమ్మకం ఉన్నవాడు. ఒక నగర జీవనుడి నయవంచనలకు బలయి, పోలీసుల పాల పడి అవమానితుడు, ఆక్రోసితుడు అయ్యే కథ. విషాదం నిండిన హుందాతనంతో మెరిసిపోయే కథ ఇది. తన పట్ల తప్పు చేసినవాడు పశువుతో సమానమని క్షమించి, తమ ఊర్లో అడుగు పెట్టి తమ ‘ఆసర సాల’ వద్దకు వచ్చీసరికి ఇంగ్లీషు చదువులు చదువుతున్న మనవడి నోట నర్సరీ రైమ్‌లు వింటూ, వాడి నానమ్మ ఎత్తుకుంటుంది పాట.‘నాగలీ నీకిదే జోహారు/ మా భాగ్య దేవతా జోహారు/ రాజ్యాలు గెలిచినా రాదు నోటికి మెతుకు/ నీ కొనమీద బతకాలి కోటాను కోట్లు’.

పాశ్చాత్య నాగరకత, తమ ప్రాతం, జీవితంపై దాడి చేసి, మూలాలనుంచి ప్రభావితం చేస్తున్నప్పుడు, తమ పిల్లలే ఆ కొత్తదనాల పట్ల మోజు పడుతున్నప్పుడు ఆఫ్రికన్‌ గ్రామాల జీవితం ఎలా కడు విషాదవంతంగా చినువా అచి బె చెప్తాడో, అటువంటి విషాద గాంభీర్యత గౌరు నాయుడి కథల్లో జీవలక్షణంగా అంతటా అలముకుని ఉంటుంది.‘నా కథలన్నింటికీ... (ఏ కొద్ది కథలకో తప్ప) కేంద్రం మా ఊరే. నాగావళీ... ఒడ్డునే మా ఊరు... ఆ మనుషులు, మనుషుల మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు, కష్టాలు, కన్నీళ్ళు- ఇవన్నీ కథల్లో చెప్పాలని...’ అని చెప్తూ ‘ఒక రాత్రి రెండు స్వప్నాలు కథా సంపుటికి తన మాటగా తవ్విపోసిన ‘మట్టి పొరల్లోంచి’లో ఇలా అంటాడు గౌరునాయుడు:

‘అందుకే గురజాడలో అడుగులు వేస్తూ, నా ముందు తరాల కథకుల్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, మళ్ళీ రాయలనే ఉంది... నా మనుషుల గురించి, మాట గురించి, మట్టి గురించి... పాట, కవిత, కథ... ఏదో వొకటి... ఎందుకంటే ‘కతలైనా యెతలైనా అంత సులువుగా వొదుల్తాయేటి’.
ఈ కథా సంపుటాల్లో లేని ఇటీవలి కథ గౌరు నాయుడు రాసింది ‘మాయ’. ఇది ‘అభివృద్ధి పేరిట విధ్వంసం’లో రెండో అధ్యాయంలో మొదలవుతుంది. మొదటిది ఏమిటంటే, డెవలప్‌మెంట్‌ పేరిట ఏవో ప్రాజెక్టులకై స్థల సేకరణ ప్రయత్నాలు ప్రభుత్వాలు, ఆయా పెట్టుబడిదారీ వర్గాల తరపున జరపడం, దానికి వ్యతిరేకంగా ప్రజాచైతన్యం మేల్కొనడం, నిరసనలు, ప్రదర్శనలు, ప్రతిఘటనలు వగైరా.

గౌరునాయుడు ఇటువంటి దిక్కుమాలిన అభివృద్ధి మొదటి అధ్యాయం పూర్తయిన చోట, అంటే స్థానిక పల్లీయుల పునరావాసం జరిగిన చోట తన కథనెత్తుకుంటాడు. ఇళ్ళన్నీ చతురస్రాకారపు దిమ్మల్లా ఉండి, ఊరు అని పిలిచే ఏ లక్షణాలూ లేని ఒక పునరావాస కాలనీ అది. సర్కారువారు ఏర్పాటు చేసింది. ఈ పునరావాస కాలనీలో ఒకనాడు ఒక వ్యక్తి చనిపోతాడు. ఈ పునరావాసం దయతో ఏర్పరచిన ప్రభుత్వం ఈ సెటిల్మెంట్‌ కాలనీకి స్మశానం ఏర్పాటు చేయలేదు.దీనితో పొరుగూరు స్మశానానికి తీసుకువెడతారు. అక్కడ మా ఊరివాడు కాదు గాబట్టి, అతని అంత్యక్రియలకు అనుమతించం అంటారు పొరుగూరివారు. వీరికి ఒక స్మశానం లేదు, పొరుగూరిలో చుక్కెదురు అయింది.

దీనితో పునరావాస కాలనీలో జీవిస్తున్న గ్రామస్తులంతా తమ పాత ఊరు ఏదైతే వదిలి వచ్చారో, ఆ ఊరి స్మశానం దారి పడతారు. నిర్మానుష్యమైపోయిన ఈ ఊర్ని హృదయ విదారకంగా వర్ణిస్తాడు గౌరు నాయుడు. ఈ అంత్యక్రియల అమలును ఉదయంనుంచీ చూస్తూ, పొరుగూరిలో తిరస్కారం, తమ పునరావాస కాలనీలో స్మశానం కొరత, తమ పాత ఊరు ఊరంతా స్మశానం వలె ఉండడం చూసిన పాత్ర ఈ ఒత్తిళ్ళకు తట్టుకోలేక, తనకు ప్రాణాలమీదకు వచ్చిందన్న సూచనతో నర్మగర్భంగా కథ ముగుస్తుంది. ప్రజల్ని తమ మూలాల నుంచి తొలిచేస్తున్న ‘మాయ’ను శక్తిమంతంగా చిత్రించాడు గౌరునాయుడు.

నయా ఉదారవాద ఆర్ధిక విధానాల పేరిట, ఈ దేశాన అమలవుతున్న పలు పాలసీల పట్ల, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి వంటి న్యాయనీతి కోవిదుల స్థాయిలో సైతం తీవ్ర అసంతృప్తి ఉంది. గౌరు నాయుడు ఏ వేదనలకు అక్షరాలను ఇచ్చాడో అటువంటి కృషిలో ఎవరెస్టంత ఎతె్తైన రచయిత రాచకొండ విశ్వనాథశాస్ర్తి పేరిట ఏర్పాటైన గౌరవం, పదిహేడవ రాచకొండ రచనా పురస్కారం ఈ నాగావళి తరంగానికి, శ్రీకాకుళం సౌరు నాయుడికి లభించడం పట్ల సర్వత్రా వెల్లడవుతున్న హర్షాతిరేకపు పొంగు, గంటేడ గౌరు నాయుడిచే సజీవ సాహిత్య సృజనను మరింత విస్తృతంగా చేయించేందుకు దోహదం కావాలి. రాచకొండ విశ్వనాథ శాస్ర్తి 17వ రచనా పురస్కారాన్ని గంటేడ గౌరు నాయుడుకు ప్రకటించిన సందర్భంగా...

No comments:

Post a Comment