Wednesday, December 7, 2011

ఇండియాగాడి టి.సి. - గంటేడ గౌరునాయుడు

4-12-2011 ఆంధ్రజ్యోతిలో ఈ వారం కథ

'ఇండియా' -
పేరయితే సుపరిచితమైందే ... ఆ గొంతు మాత్రం ఎప్పుడూ విన్నట్టు లేదు. కాగితాల్లోంచి తల ఎత్తి చూసేను వాడివేపు. "టీ.సీ. కావాల్సార్'' అడిగేడు వినయంగా చేతులు కట్టుకుని.
నేరేడు పండులా నిగనిగలాడుతున్నాడు. బొద్దుగా ఉన్నాడు. ఐదువందలమంది విద్యార్థుల్లో 'ఇండియా' పేరుగల వాడు ఒక్కడే. వాడు నాకు బాగా తెలుసు. క్లాసులో చురుకైన వాడు కూడా! రేడియో ... అని మరొకడున్నాడు ఎనిమిదో తరగతిలో. వీళ్లిద్దరూ పేర్ల ప్రత్యేకత వల్ల బాగా గుర్తు నాకు. మరి వీడెవడు? నేనే 'ఇండియా' అంటున్నాడు. అనడమే కాదు టీ.సీ. ఇమ్మని అడుగుతున్నాడు. బహుశా గతంలో చదివి మానేసిన వాడేమో.

"ఒరే ... నువ్వు నాకు తెలీదు. నిన్నెప్పుడూ చూసిన గుర్తు లేదు. అసలు నువ్వు ఎక్కడ చదివావు?'' అడిగేను మళ్లీ నమ్మకం కుదరక.
"ఇక్కడే చదివాను సార్...'' జంకు లేకుండా చెప్పేడు.
నాకు అసహనంగా ఉంది.
కొత్తగా స్కూల్లో చేరుతున్న పిల్లలతో, వారి తల్లిదండ్రులతో ... పదో తరగతి మార్కుల జాబితాల కోసం వచ్చిన విద్యార్థులతో అంతా గోలగోలగా ఉంది. ఈ గోల నడుమ ఆఫీసునుండి సర్క్యులర్ ... సమగ్ర సమాచారంతో మీటింగుకు హాజరు కావాలని. ఎప్పుడూ ఏదో ఒక మీటింగ్ ... ఇచ్చిన సమాచారమే మళ్లీ మళ్లీ ఇవ్వాలి. ఇక ప్రతి తరగతికీ వందకుమించి పిల్లలు ... ఇరుకిరుకు గదుల్లో ఉక్కతో, చెమటతో పాఠ్యబోధన. పోనీ సరిపడా సిబ్బందిని నియమిస్తారా అంటే అదీ ఉండదు. అయినా కోర్సు పూర్తి కావాలి. రిజల్టు శతశాతం రావాలి. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు.

ఇది గమనిస్తారు విద్యార్థులు. చదివినా చదవకపోయినా పాసయ్యేలా చేయాల్సిన బాధ్యత టీచర్లదే. రిజల్టు రాకపోతే టీచర్లకే నష్టం ... మాకేం! అన్నట్టుంటారు. ఒకరకంగా బ్లాక్ మెయిలింగే. తెలివైన పిల్లల్ని గురుకుల పాఠశాలలకి పంపించాలి. కనీస పూర్వజ్ఞానం లేని బ్రిడ్జి స్కూల్లో పిల్లల్ని వయసును బట్టి ఆయా తరగతుల్లో చేర్చుకోవాలి. వాళ్లని పల్లెత్తు మాట అనకుండా ప్రతిభావంతుల్ని చేసెయ్యాలి. కాదూ ... లేదూ అంటే మెమోలు ... సస్పెన్షన్లు. హెడ్మాస్టరు ప్రమోషనుతో పాటు బీ.పి, షుగరూ వచ్చేయి. చేసుకున్న పాపమో ... ఏ శాపమో ... యీ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగం.
"పోస్ట్ ...''
పోస్ట్‌మాన్ ఉత్తరాలిచ్చి వెళ్లేడు.
పోస్ట్‌మాన్ వచ్చాడన్నా భయమే. మెమోలే తెస్తాడో, సస్పెన్షను ఆర్డర్లే మోసుకొస్తాడో అని. అనుకున్నట్టే ఐ.టి.డియ్యే ఆఫీసు నుంచి కవరు. చింపి చూస్తే మామూలే. 'జ్వరంతో ఉన్న విద్యార్థిని ఆసుపత్రికి పంపించకుండా ఇంటికెందుకు పంపించారో సంజాయిషీ ఇవ్వవలసిందిగా పీ.వో.గారి ఆదేశం.'
"సార్ ... నా ... టీ.సీ.''

"నువ్వేంట్రా ఇలా తగులుకున్నావూ. మాస్టారూ, వీడి సంగతేటో చూడండి'' సీనియర్ అయిన తెలుగు మాస్టారుకి అప్పగించి మీటింగుకు అవసరమైన సమాచారం కోసం రికార్డులు చూడ్డంలో పడ్డాను. దానికితోడు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. పీ.వో. లెటర్‌కి సంజాయిషీ రాయాలి. జ్వరం వచ్చిన పిల్లలు అమ్మానాన్నల్ని చూడాలనుకుంటారు. అసలు అమ్మానాన్నలకి దూరం కావడమే జ్వరానికి కారణమౌతుంది. చాలా సార్లు ఇంటికెళ్తే ఆ బెంగా, జ్వరమూ రెండూ తగ్గిపోతాయి. తల్లిదండ్రులు వచ్చి 'రెండు రోజులు ఇంటికి తీసుకెళ్తాం సార్'' అంటారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తామంటే వినరు. అటు ఆఫీసర్లు ఇటు తల్లిదండ్రులు ... తిరగట్లో వేసిన గింజల్లా నలిగిపోవాలి మేము. చెయ్యని తప్పులకి సంజాయిషీలు చెప్పుకోవడమే బతుకులాగుంది. వార్డెన్‌ని పిలిచి పీ.వో. లెటర్ యిచ్చేను. బయట మబ్బుగా ఉంది.. మనసులో లాగే.
ఓ గంట తరువాత వచ్చేరు తెలుగు మాస్టరు. వస్తూనే "బిడ్డికి ఇండియా వీడేన్సార్'' అని చెప్పేరు. నాకు ఆశ్చర్యమూ, అనుమానమూ రెండూ కలిగాయి. నాకు తెలిసి తొమ్మిదో తరగతి దాకా చదివిన ఇండియా వేరు. మరి వీడు? "అదెలా సాధ్యం?''

"మరేం లేదు సార్ ... వీడిది తాడికొండ. పేరు ఇండియా. ఆ ఊళ్లో ఏడు దాకా చదివి టీ.సి. తీసుకున్నాడు. ఒకరోజు వీడు ఏదో ఊరెళ్లేడట. అక్కడ ఎవడో కేట్లబారు (ఉండేలు)తో పిట్టల్ని కొడుతుంటే వీడికి ఆ కేట్లబారు మీద కన్నుపడింది. అది నాకు ఇచ్చేస్తావా అని అడిగాడట. పాతిక రూపాయలిస్తే కేట్లబారు ఇస్తానన్నాడట. డబ్బులు లేవుగాని నా దగ్గర టీ.సీ. ఉంది, అది ఇచ్చేస్తాను అన్నాడట వీడు. అంతే వీడి దగ్గరున్న టీ.సీ. వాడికిచ్చి వాడి దగ్గర నుండి కేట్లబారు వీడు తీసుకున్నాడు. వీడికి చెట్లంట ... పుట్లంట తిరగడం ఇష్టం. వాడికి చదవడం ఇష్టం. వీడు ఎస్టీ ... వాడు ఓ.సి. అదీ సంగతి'' విషయం తేల్చేసేరు. "వీడి టీ.సీ.మీద చదవాల్సిన ఖర్మ వాడికేమి? ఓ...సీ... అయినా మన స్కూల్లో చేరవచ్చును కదా చదవాలనుకుంటే...''
"అదీ అడిగేను. వాడో పెద్ద తెలివైన పని చేసేడట. ఏడో తరగతి చదువుతున్నవాడు తొందరగా పెద్ద చదువులు చదివెయ్యాలని తన టీ.సీ.లో 'ఏడు'ను 'తొమ్మిది'గా దిద్దేసేడట. దిద్దుబాట్లు చెల్లదని తిప్పి పంపిస్తే తిరిగి తొమ్మిదిని ఏడు చేసాడట. కాని ఆ టీ.సీ. ఎక్కడా చెల్లుబాటు కాకపోవడంతో అడివిలో కేట్లబారుతో పిట్టలు కొట్టుకోవడంలో పడ్డాడు. అదుగో అటువంటప్పుడు మనవాడు టీ.సీ.తో ఆదుకున్నాడు. ఒకవేళ వాడి టీ.సీ.తోనే చదివినా ... వాడు ఓ.సీ. కాబట్టి రిజర్వేషను వర్తించదు. మీరయితే బడిలో సీటు ఇవ్వగలరు. కాని చదువయ్యేక ఎస్టీ రిజర్వేషన్లో ఉద్యోగం ఇవ్వగలరా? ఎస్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిక్కెటో, ఎమ్పీ టిక్కెటో వచ్చేలా చేయగలరా?'' అన్నారు నవ్వుతూ.

నిజమే ... గిరిజనుల పేరిట నకిలీ «ద్రువపత్రాలతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న గిరిజనేతరులు ఎంతమంది లేరు? ఇలా ఎస్టీ సర్టిఫికేట్లు సంపాదించలేని వారు మరోదారి చూసుకుంటున్నారు. బాగా చదువుకుని ఉద్యోగం చేసే గిరిజన అమ్మాయిలకు వలవేసి వాళ్లను పావులుగా వాడుకోవడం, ఉద్యోగాల్లోను రాజకీయాల్లోను చక్రం తిప్పడం ... ఇదీ నకిలీల లీల. "ఎంత అభివృద్ధి చెందేవో కదా నా దేశమా! ఓ నా ఇండియా'' అన్నానో లేదో ....
"పిలిచేరా సార్'' లోపలికొచ్చేడు ఇండియా.
"నువ్వెక్కడ తయారయ్యావురా నా పీక మీదకి ... ప్రాణాలు తోడేస్తున్నావు ... ఔనొరే, నీ టీ.సీ. తో చదివిన వాడి పేరేఁట్రా'' అడిగేను అసహనాన్ని అణచుకుని.
"హరీశు ...'' చెప్పేడు మెల్లగా.
"వాడా ...'' హరీశ్ రూపం కళ్లముందు కదలాడింది.
బయట వర్షం ప్రారంభమైంది.

"అవున్రా... రెండేళ్లు గాలికి తిరిగి ఇప్పుడు ఏకంగా పదో తరగతి చదవడానికి వచ్చీసేవు. అక్షరాలు గుర్తున్నాయా నీకు? ఇన్నాళ్లు లేనిది చదవాలనే బుద్ధి ఇప్పుడెలా పుట్టిందిరా?'' ఈ సారి అనునయంగానే అడిగాను.
"పదో తరగతి పరీక్షలు యిక్కడే జరుగుతాయిట కద సార్. పుస్తకాలు సూసి రాయించి ఎలాగైనా పరీక్ష పేస్ సేయించుతారట ... మా బావ సెప్పినాడు... పదో తరగతి పేసయితే పోలీసుజ్జోగానికి ఎలిపోవచ్చట'' దాపులేకుండా చెప్పేడు.
'సూసి రాయించి ...' అని వాడన్నందుకు కోపమూ ... అది వాస్తవమే అయినందుకు 'సిగ్గూ' కలిగేయి. నిజమే... పాస్ చేయించాలి. లేదంటే ఇంక్రిమెంట్లు ఆగిపోవడమో, సస్పెండ్ కావడమో తప్పదు. ఏడాది పొడువునా కష్టపడి గొంతు చించుకుని పాఠాలు చెప్పింది పనిష్మెంట్ల కోసమా? అందుకే ... యీ అడ్డమైన పనులన్నీ . నేనో హెడ్‌మాస్టరుగా ఈ మాట అనకూడదు నిజానికి. అయినా జరుగుతున్న తంతు ఇదే. అధికారులకు తెలుసు.

బయటి ప్రపంచానికి తెలుసు. ఇది బహిరంగ రహస్యమే. ప్రతి పరీక్షాకేంద్రంలోనూ వేలాది రూపాయల వ్యవహారం నడుస్తుందన్నది నమ్మక తప్పని నిజం. ఇన్విజిలేటర్లు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా, యింకా అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎందరో ... భాగస్వాములుగా ఆ పబ్లిక్ పరీక్షలు పబ్లిక్ కాపీలుగా జరిగిపోతుంటాయి. తల్లిదండ్రులకీ, ఉపాధ్యాయులకీ, అధికారులకీ ... అందరికీ కావాలి శతశాతం ఫలితాలు. తెలిసీ చేసే మా యీ పాపాలకి ఏ ఫలితం అనుభవిస్తామో అని అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా దుఃఖం ముంచుకొస్తుంది. అయినా ఏమీ చెయ్యలేని అశక్తత.

'మీ మీద విశ్వాసం ఉంది. మీ నిజాయితీపై నమ్మకముంది. కాపీయింగ్‌కు తావులేకుండా స్ట్రిక్ట్‌గా పరీక్షలు జరపండి. స్వశక్తితో ఎందరు ఉత్తీర్ణులవుతారో అవ్వనివ్వండి. ఖచ్చితమైన ఫలితాలు రానివ్వండి. ప్రతిభకు పట్టం కట్టండి. మెమోలు, సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్లు కోత ఇవేవీ ఉండవు అనే అధికారి ఎవరైనా వచ్చి ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తే ...' నాది అత్యాశే, ఇదొక పగటి కలే. బయట వర్షం ఎక్కువైంది.
కిటికీలోంచి గాలి విసిరికొట్టింది.
నా కల చెదిరిపోయింది.
వేడి టీ తాగితే తప్ప ... మరి పని చెయ్యలేననిపించింది.
మనసెరిగినట్టు అటెండర్ సోములు టీ తీసుకొచ్చేడు.
ఉత్సాహం వచ్చినట్టయింది.
సిబ్బంది సమావేశం ఏర్పాటు చేసి 'ఇండియా' సమస్య వారి ముందుంచేను. "సార్ ... ఇది చిన్న విషయం కాదు. వాడు మనల్నీ, ప్రభుత్వాన్నీ మోసం చేసేడు. పోలీసు రిపోర్టిస్తే వాళ్లే చూసుకుంటారు'' సోషల్ మాస్టరు తన అభిప్రాయం చెప్పేరు.
"పోలీసుల వరకు ఎందుకు, లేనిపోని గొడవ. ఇండియాని, హరీశ్‌ని వాళ్ల పెద్దల్ని తీసుకురమ్మని చెప్పి వాళ్లముందే ఏదో తేల్చుకుంటే మంచిది'' సైన్సు మాస్టారు సూచించేరు. లెక్కల మాస్టారు, మిగతా ఉపాధ్యాయులు కూడా సైన్సు మాస్టారి సూచనను బలపరిచేరు. ఇండియాని పిలిచి చెప్పేను.

"ఒరే అబ్బాయ్ నువ్వెళ్లి హరీశునీ, వాళ్ల నాన్ననీ రమ్మన్నానని చెప్పు. మీ నాన్ననీ తీసుకురా. వాళ్లతో మాట్లాడాక నీ టి.సి. నీకిస్తాం. లేదంటే పై అధికార్ల్లకి రిపోర్టు చెయ్యాల్సి ఉంటుంది.''
"అది కాద్సార్... టీ.సీ. నాదే కద సార్. నా టీ.సీ. నాకు ఇచ్చీయండి సార్'' మొండిగా కదలకుండా అక్కడే నిలబడ్డాడు వాడు.
"ఒరే... మీ నాన్నో , అన్నో, బావో ... ఎవరో ఒకరు వస్తేగాని టీ.సీ. ఇవ్వడం కుదరదు. వెళ్లు ... వెళ్లి ఎవరో ఒకర్ని తీసుకుని రా...''
మా పి.ఇ.టి వచ్చి వాడిని బయటకు లాక్కెళ్లేడు. అప్పుడొచ్చేడొకడు రంగం మీదకి 'ఎందుకు కుదరదు' అంటూ. మందు మీదున్నాడు, తూలిపోతున్నాడు.
రేపటి మీటింగు కోసం నింపాల్సిన కాగితాలింకా అలాగే ఉన్నాయి.
మా పీ.వో .... అతగాడొక సీతయ్య. అడిగిన సమాచారం వెంటనే చెప్పకపోతే నోటికి వచ్చినట్టు వాగుతాడు. ఎదుటి మనుషుల్ని పురుగులకన్నా హీనంగా చూస్తాడు. ఉపాధ్యాయులంటే మరీనూ. తాను తప్ప అందరూ దొంగలే అనుకుంటాడు. కేవలం తిట్టడానికే మీటింగ్‌కు రమ్మంటాడనిపిస్తుంది. ఆ తిట్లు వింటుంటే అక్కడికక్కడే రాజీనామా చేయాలనిపిస్తుంది.
అయితే ఒకటే తృప్తి. అమాయకమైన గిరిజన పిల్లలకి నాలుగు అక్షరమ్ముక్కలు చెప్పి వారికి బతుకుదారి చూపించగలుగుతున్నాం కదా అని. మా దగ్గర చదువుకున్న పిల్లలు ఉద్యోగాల్లో కుదురుకుని ఎప్పుడో ఎక్కడో ఎదురై 'నమస్కారం మాస్టారూ' అన్నప్పుడు కలిగే ఆనందంలో యీ అధికార్ల తిట్లు, చీవాట్లు అన్నీ కొట్టుకుపోతాయి.

"ఏటి గురూ... టీ.సీ. కాయితం యిచ్చిద్దూ బేగి...'' మందుబాబు ముందుకొచ్చాడు. నిరంతర జీలుగుపానంతో వాడి బుగ్గలు ఒగుడుదేరి కళ్లు ఎర్రగా బొడ్డపళ్లలాగా ఉన్నాయి. మాట్లాడుతుంటే సారావాసన గుప్ మంటోంది. నిత్యం వాళ్లతోనే వ్యవహారం ... సాధారణం మాకివన్నీ ...
"మాస్టారూ ... ఈ వ్యవహారమేదో చూడండి'' అని తెలుగు మాస్టారికి వొప్పజెప్పి బయటపడబోయేను.
"ఎటెల్లి పోతావు గురూ ..'' అని అడ్డుపడ్డాడు మందుబాబు.
పి.ఇ.టి వాడి రెక్కపట్టి విసురుగా బయటకు లాగి -
"వేషాలేస్తున్నావేటి ... పోలీసు రిపోర్టిచ్చి లోపలేయించీయాలేటి'' అని కేక లేసేడు. వాడు బెదరలేదు సరికదా ... "ఏటీ... పోలీసులంతే బయ్యవేటి. రమ్మనయితే... ఓహో..'' అన్నాడు మరింత ఊగిపోతూ.
తాగినోడితో తగువేటని నేనే వెనక్కి లాగేను పి.ఇ.టి ని. అసలే మా పి.ఇ.టి కోపగొట్టోడు. కొట్టేసినా కొట్టేస్తాడు.
"ఇంతకీ ... ఇండియాకి నువ్వేటవుతావోయ్? అన్నాను అనునయంగా.
"ఓయ్ అంతావేటి, నువ్వేటి నా బామ్మర్దివేటి గురూ'' అని నా వైపు అదోలా చూసి "యేటవుతానా ... ఇండియాకి నేను ... పాకిస్తాన్...'' అని పెద్దగా నవ్వి తూలిపడ్డాడు.
"ఆహా... అంత ఇకటాలగుందేటి... సరే అయితే... ఇండియాకి పాకిస్తాన్‌కి మేచ్ ఏర్పా టు చేస్తాం లే... పోలీస్‌స్టేషన్ల. ఎస్సైగారే.. ఎంపైర్... బ్రహ్మాండమైన మేచ్... ఏటంతావు...'' పి.ఇ.టి మాటకి అందరూ గొల్లున నవ్వేరు. "అదికాదు గురో.. విండియా... పాకిస్తాను బెదర్స్ గదేటి. ఈడికి నేను బెదర్ సోదర్...'' అని లేవబోయి మత్తుగా వాలిపోయేడు వరండాలో.
నేను ఇండియాను పిలిచి నెమ్మది మీద చెప్పేను.
"రేపు నువ్వూ .. హరీశూ ... మీ వాళ్లను తీసుకుని రండి. ఇద్దరి దగ్గరా కాగితాలు తీసుకుని నీ టీ.సీ. నీకు ఇచ్చేస్తాను.''

మరిక తప్పదని అనుకున్నాడో ఏమో ... బయటికి వెళ్లేడు తలవంచుకుని. హమ్మయ్య... అని ఊపిరి పీల్చుకున్నాను. వాతావరణం ప్రశాంతంగా మారింది. బయట వర్షమూ తగ్గింది.
మధ్యాహ్నం భోజనాలయ్యేక ఎవరి తరగతి గదుల్లో వారుండగా నేను రేపటి మీటింగుకు అవసరమైన సమాచారం వెతుకులాటలో ఉండగా గ్రామసర్పంచ్ వచ్చేడు. వచ్చి "నమస్కారం గురువుగారూ...'' అని కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
సర్పంచ్ మా బడిలోనే చదువుకున్నాడు. మా పూర్వ విద్యార్థి. వాళ్ల అబ్బాయిని బడిలో చేర్పించడానికి తీసుకువస్తానని వారం క్రితం ఎప్పుడో చెప్పేడు. ఈ రోజు తెచ్చి ఉంటాడని ... అనుకున్నాను. కానీ వాళ్లబ్బాయి రాలేదు.
సర్పంచ్ కుర్చీ వెనక్కి వొచ్చి నిలబడ్డాడు ఇండియా.
నాకయితే పట్టరాని కోపం వచ్చింది.
"ఏఁరా ... చిలక్కి చెప్పినట్టు చెప్పినా బుర్రకెక్కలేదా?'' అని కేకలేసేను. అప్పుడొచ్చేరు. ఇండియా టీ.సీ.తో చదివిన హరీశూ ... వాడి అన్న ... ఇండియా సోదరుడు మందుబాబూ.
అందరూ అనుకునే వచ్చేరని... ఎదురు పడటానికి ముఖం చెల్లక ఇంతవరకూ బయటెక్కడో ఉన్నారని అటెండర్ చెప్పేడు. సర్పంచ్‌కి విషయం చెప్పేను.
"నేనూ అందుకే వచ్చాను సార్'' అన్నాడు సర్పంచ్.
"ఒరే ... ఒకడి టీ.సీ తో మరొకడు సదవడం ... ఒకడి పరీక్ష మరొకడు రాయడం ... నేరమని తెలియదురా మీకు? జరిగిందేదో జరిగిపోయింది. సరే ... ఈడి టీ.సీ.యీడికిచ్చీయండి. హరీశు ఆడి బాధేదో ఆడు పడతాడు ...'' తేల్చేసేడు సర్పంచ్.

ఇండియా ముఖం వెలిగిపోతోంది.
హరీశ్ వేపు చూసేను. అపరాధభావంతో నా ముఖం చూడలేక తలదించుకున్నాడు.
అందర్నీ ఒకసారి ఆలోచించుకుని కాగితం రాసి తెమ్మని బయటకు పంపించేను. బయటకు వెళ్తూ ... హరీశ్ వెనుదిరిగి దీనంగా చూసేడు.
నా గుండె కలుక్కుమంది.
హరీశ్‌ని చూస్తుంటే మనసులో 'సంధ్య' మెదిలింది.
సంధ్య ...
నేను గతంలో స్కూలు అసిస్టెంటుగా పని చేసిన స్కూల్లో పని చేసేది తెలుగు టీచర్‌గా.
మంచి టీచర్‌గా పిల్లల అభిమానాన్నీ అధికారుల మెప్పునీ పొందగలిగింది. చక్కగా పాటలు పాడేది. పిల్లలకు డాన్సులవీ నేర్పేది.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణ బాధ్యత ఆమెదే. స్కూలుకి ఎన్నో బహుమతులు తెచ్చిపెట్టింది.
మూడేళ్లు గడిచేయి.
ఉన్నట్టుండి బడికి రావడం మానేసింది.
ఎటువంటి సమాచారమూ లేదు. ఏమైందో తెలుసుకుందామని వెళితే ఇంటికి తాళం వేసి ఉంది.
తరువాత తెలిసిన విషయం ...

సంధ్య తల్లీ తండ్రీ నాగావళి నదిలో పడవ ప్రయాణంలో మరణించేరు. ఆరేళ్ల సంధ్య పాటలు పాడుకుంటూ అనాథగా వీధుల్లో తిరుగుతుంటే ఓ మాస్టారు చూసి ఏదో ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌ను బ్రతిమాలి భోజనం, వసతి ఏర్పాటు చేసేరు. దీర్ఘకాలంగా బడిమానేసిన వారి పేర్లు రిజిష్టర్లోంచి తొలగించే దశలో... ఓ అమ్మాయి స్థానంలో సంధ్యను కొనసాగించేలా నిర్ణయం తీసుకుని... సంధ్యకు ఆ విధంగా మేలు చేయాలనుకున్నారు హెడ్మాస్టరు... వార్డెను.
పదోతరగతి మంచి మార్కులతో పాసయ్యింది సంధ్య. వార్డెను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంటరు, డిగ్రీ పూర్తి చేయించి, బి.ఇడి. ట్రైనింగ్‌కు పంపించేడు. శిక్షణాకాలం పూర్తి కాగానే మా స్కూల్లో వచ్చిన ఖాళీలో సంధ్య టీచర్‌గా చేరింది. ఉద్యోగం వచ్చేక సంధ్య వార్డెన్‌కి రెండో భార్యగా ఉండాల్సి వచ్చింది. సంధ్య ఉద్యోగంలో చేరిందని ఎలా తెలిసిందో అప్పుడు బడిమానేసిన అమ్మాయి సంధ్యను కలిసి విషయం బైట పెడతాననడంతో ... వార్డెన్ సంధ్య నెలజీతంలో కొంత సొమ్ము ఆమెకి అందించేలా ఓ రహస్య ఒప్పందం చేసుకున్నాడు.

కొన్నాళ్లయ్యేక వార్డెన్‌కీ, గిరిజన సంఘం ప్రెసిడెంట్‌కీ ఓ అమ్మాయి విషయంలో ఘర్షణ వొచ్చి 'సంధ్య' సంగతి తనకు తెలుసుననీ, మీ అంతు తేలుస్తాననీ వార్డెన్‌ను, సంధ్యను అతను బెదిరించడంతో భయపడిపోయిన సంధ్య స్కూలు కు రావడం మానేసింది. అపరాధ భావంతో ... అవమాన భారంతో ... ఆ తర్వాత ఇల్లు దాటి బయటకు రావడమే మానేసింది. మరి కొన్నాళ్లకి తెలిసింది సంధ్యని వార్డెన్ వొదిలేసాడని. ఆ తరువాత ఏమయ్యిందో ఏమో ... సంధ్య ఎప్పుడూ ఎవరికీ కనబడలేదు. అసలు జీవించి ఉందో లేదో ... సంధ్య జ్ఞాపకాల్తో నా కళ్లల్లో నీళ్లూరేయి.

"మాస్టారూ ...''
సర్పంచ్ పిలుపుతో ఈలోకంలోకి వచ్చాను.
"ముందుముందు మీకు ఈళ్లల్లో ఎవలవల్లా యే యిబ్బంది లేకుంట యిద్దరి దగ్గిరా కాయితాలు తీసుకున్నాను సార్. ఆడి టీ.సీ. ఆడికిచ్చీయండి. ఇదిగోండి కాయితాలు...'' అని ఇండియా, హరీశు వాళ్ల పెద్దల సంతకాలతో ఇద్దరివల్లా తప్పున్నట్టు ఒప్పుకున్న కాగితాల్ని నా చేతిలో పెట్టాడు సర్పంచ్.
ఇకముందు ఇటువంటి పని ఎప్పుడూ చెయ్యొద్దని ఇండియాని హెచ్చరించి, వాడికి టీ.సీ. యిచ్చేసి "నా దగ్గరే ఉండి ప్రైవేటుగా పదోతరగతి చదువుదువుగానీ ... బడికి వచ్చీ'' అని హరీశ్‌కి చెప్పేను. ఇంటికెళ్లి వస్తానని వెళ్లిన హరీశ్ ఎందుకోమరి మళ్లీ బడికి రాలేదు. పదోతరగతి పరీక్ష రాయనూ లేదు.
నా రోజు వారీ పని వొత్తిడిలో పడి ... ఆ విషయమే మరిచిపోయేను. ఓసారి ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాటల సందర్భంలో ఒక హెచ్చెమ్ అన్నాడు, "ఇండియా ... తన స్కూల్లో జాయినయ్యేడని''.
'ఎక్కడో అక్కడ పదోతరగతి పాసైపోతే... ఏ కానిస్టేబులుగానో సెలక్టయిపోతాడు. వొడ్డూ పొడవూ వున్నోడు గాబట్టి' అనుకున్నాను. హరీశ్ గురించి వాళ్ల ఊరు పిల్లల్ని అడిగితే 'వాడిప్పుడు సారా యాపారం సేసుకుంటున్నాడు సార్' అని చెప్పేరు. బాగా డబ్బులొస్తున్నాయట కూడా. ఎంత డబ్బులొస్తే మాత్రం అదేం జీవితం? తెలివైన కుర్రాడు. చదివితే మంచి ఉద్యోగంలో స్థిరపడాల్సిన వాడు. క్లాస్‌రూంలో చాలామంది పిల్లల్ని గురించి చాలా ఊహిస్తాం. ఉన్నతస్థాయిలో కనిపిస్తాడనుకున్నవాడు సంత దగ్గర కర్రలకావిడి తెస్తూ కనిపించినప్పుడూ, పనికి రాడనుకున్న పిల్లడు 'ఏదో ఉద్యోగం చేస్తున్నాననీ ... హాయిగా ఉన్నాననీ' చెప్పినప్పుడూ ... చిత్రంగా అనిపిస్తుంది.

జీవితం మన నమ్మకాలకీ ... సూత్రాలకీ ... సిద్ధాంతాలకీ .. లొంగేది కాదేమోననిపిస్తుంది. ఒకసారి స్కూలు పనిమీద పై అధికారితో కలిసి కొన్ని ఆశ్రమ పాఠశాలల్ని సందర్శించాల్సి వచ్చింది. అలా వెళ్లిన స్కూళ్లలో ... 'ఇండియా' చదువుతున్న స్కూలుంది. గతం కళ్లముందు కదలాడింది.
ఇండియాని చూడాలనిపించింది.
ఎలా చదువుతున్నాడో అడగాలనిపించింది.
పాఠశాల సాధించిన విజయాలను గురించి మా అధికారికి వివరిస్తూ... బహుమతుల్ని ... షీల్డులను ... పతకాలను చూపించి ఇటీవల బాలల దినోత్సవ సందర్భంగా జరిగిన వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయి ప్రథమ బహుమతి ద క్కించుకున్నది 'ఇండియా' అని మా స్కూలు విద్యార్థే ... అని చెప్పేడు.
ఇండియాని పిలుస్తారా అనడిగేను హెచ్చెమ్‌తో.

"మీ స్కూలు నుంచే కదా... టీ.సీ.తో వచ్చి ఇక్కడ చేరేడు. తెలివయినవాడు. టీ.సీ. ఎందుకిచ్చీసేరు? అటువంటి పిల్లాడుంటే స్కూలుకీ పేరు. రిజల్టులో పెర్సెంటేజీ కలిసొస్తుంది. పెర్సంటేజీ మాటకేం గానీ... వాడు గ్యారంటీగా త్రిబుల్ ఐటి కి సెలక్టవుతాడు'' అని వాడి గురించి ఎంతో గొప్పగా చెప్పి 'ఇండియా'ని పిలుచుకురమ్మని అటెండర్‌ను పంపించేడు. లెక్కల క్లాసు అవుతూందనీ ... క్లాసయ్యేక పంపిస్తానని లెక్కలుసార్ చెప్పమన్నారనీ అటెండర్ చెప్పాడు. అంతవరకూ ఆగే సమయం లేక 'మరోసారి చూస్తాన్లెండి' అని వెళ్లబోతుంటే పీరియడ్ పూర్తయినట్టు గంట మోగింది. ఆఫీసు పక్కనే ఉన్న పదోతరగతి గదిలోంచి ఎర్రగా... సన్నగా... రివటలా ఉండే చురుకైన కుర్రాడొకడు ఎదురొచ్చేడు. హెడ్మాస్టరు వాడి భుజం మీద చెయ్యేసి అన్నాడు.
వీడే "ఇండియా...'' అని.
తెల్లబోయాన్నేను.
ఇండియా ...?!!!



* గంటేడ గౌరునాయుడు
రచయిత సెల్: 94414 15182

No comments:

Post a Comment