Wednesday, December 7, 2011

మట్టిమీద 'మమకారం'

(23 Nov) ఉద్యమం కోసం కథకుడైన వాడే అట్టాడ అప్పల్నా యుడు. అందుకు ఆయన సాహిత్యమే సాక్ష్యం. 'పువ్వుల కొరడా'తో కథల బండి ఎక్కిన అప్పల్నాయుడు ఎనభయ్‌కి పైగా కథలు రాశారు. అందులో పదిహేడేళ్ల క్రితం రాసిన 'మమకారం' ఇవాళ రైతులోకం క్రాప్ హాలీడే ప్రకటించ వలసిన పరిస్థితులను ఆనాడే వివరిస్తున్నట్టు ఉంటుంది. విశాఖలో ఉద్యోగం చేసే కొడుకు, కోడలూ, మనవ రాలూ, ఆ ముసలితల్లి ఓ కుటుంబం. అప్పు చేసి పట్నంలో ఇల్లు కట్టిన కొడుకు ఆ అప్పు తీర్చడానికి ఊరులో పొలం అమ్మాలని కౌలు రైతు సిమ్మన్నకు కబురు చేస్తాడు. ఒకరోజు సిమ్మన్న ఓ గుమ్మడికాయ, భుజమ్మీద రెండు మూటల్లో నువ్వులు, వేరుశెనగకాయలు తీసుకుని 'నడిచొచ్చే పంట మొక్కలా' వచ్చి నిలిచాడు. ఆ ముసలితల్లికి పొలమ్మీద మమకారం. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు అన్నీ ఆ పొలమ్మీద పంటతోనే జరిగాయి. భర్త చెమటధారలతో పండించిన పొలం అదే. పొలాన్ని అమ్మవద్దంటుంది తల్లి. పడమటి రెడ్లు భూములని మంచి రేటుకు కొంటున్నారని, ఈ సమయంలో అమ్మితే లాభసాటిగా ఉంటుందని కొడుకు ఆలోచన. సిమ్మన్న కూడా పొలం అమ్మకం సరికాదనే చెబు తాడు. 'సేపల సెరువులకోసం భూముల్ని వాడితే పంట భూమి పనికిరాని ఎడారైపోతుంది బావ్' అంటాడు. తల్లి తన కోపాన్ని మౌనంగా ప్రకటిస్తుంది. దాంతో భూమి అమ్మే ఆలోచన అప్పటికి ఆగింది. విశాఖ నుంచి హైదరాబాద్ బదలీ అయిన కొడుకుతో వెళ్లి కోడలు, మనవరాలితో కొంచెం బాగానే గడిపినా మన సంతా సొంతూరులోని పొలమ్మీదనే తల్లికి. ఓసారి అంటుం ది కొడుకుతో, 'సిమ్మన్న యింతదూరం రాలేడు సంక్రాంతికి నేనే ఎల్తాన్రా ఊరు' అని. పక్షవాతం సోకిన తల్లి ప్రయాణం చేయడం సరికాదని, వద్దంటా డు కొడుకు. 'సొంత మట్టి మీద ఊపిరిపోతే ఇంకేటి కావాల.. బాబొరే! నేను గాని ఇక్కడ సచ్చిపోతే అస్థికలైనా వంశధారల కలిపీ'' అంటుంది తల్లి, అదో అపురూపమైన కోరికలా. చేపల చెరువుల కోసం పడ మటి రెడ్లు భూముల్ని ఎక్కువ ధరకి కొనడానికి ముందుకు రావడంతో కొడుకు మళ్లీ భూమి అమ్మకానికి పెడ తాడు. అప్పటి నుంచి మౌన ముద్ర దాల్చిన ముసలి తల్లి, నేలకు దూరమైన దిగులుతోనే తనువు చాలిస్తుంది. ఆనందంగా ఉన్న ప్పుడు తల్లిని, 'తులసి మొక్క గాలికి కదలాడినట్టుగా ఉం ద'ంటాడు రచయిత. తరువాత రోదించే అమ్మ, 'దుప్పటి లో 'దుఃఖపు మూట'లా ఉందంటాడు. తల్లి కోరిక ప్రకారం అస్థికలని వంశధారలో కలపడానికి సొంతూరికి బయలు దేరతాడు కొడుకు. రైలు దిగి ఊరికి వెళ్లే దారిలో తోటలో సంత జరుగుతుంది. అక్కడివారు కొందరు తనని పోల్చు కోలేక పోతారు. తాను కొందరిని గుర్తు పట్టలేకపోతాడు. గుర్తు పట్టి తనను పలకరించి తల్లి పోయిన విషయం తెలిసి సానుభూతి చూపిస్తారు. ఊరు చాలా మారిపోతుంది. ఆ ఊరి బతు కులు ఎలా ఉన్నాయంటే, ''ఇరిగిన మం చం, వొరిగిన పంచ, కరుపట్టిన కంచాలు'' అని మూడు ముక్కల్లో తమ పేదరికాన్ని వివరిస్తుంది మేనత్త. వంశధారలో తల్లి అస్థి కలు కలిపి తిరిగి బయలుదేరిన కొడుకు సంత తోట దగ్గరికి వచ్చేసరికి నిర్మాను ష్యంగా ఉంటుంది. ఓ చెట్టు కింద మాత్రం ఒకడు గారడీ చేస్తున్నట్టు చేతులూ పుతూ కేకలేస్తుంటా డు. 'సూస్కోండి! సూస్కోండి! మీరు సూస్తండగానే ఈ టెంక సెట్టైపోద్ది. కొమ్మకొమ్మకీ గుత్తులు గుత్తులు కాయలు. కొమ్మలు నరక్కండి. సెట్టు కొట్టీకండి! సెడిపోతారు!' అంటూ శూన్యంలోకి చూస్తూ పిలు స్తుంటాడు. ఆ వ్యక్తిని గుర్తు పడతాడు. చింపిరిజుట్టు తో 'ఎండిన బీరపాదులా' ఉన్న అతడు ఒకనాడు 'నడిచే పంటమొక్కలా'కనిపించిన సిమ్మన్నే. సొంత గడ్డ మీద మమకారాన్ని వదులుకోలేక తల్లి ఈ లోకాన్ని వదిలేసిందనే వ్యథ, పొలం మీద మమకారం వదులుకోలేక సిమ్మన్న పిచ్చివాడైపోయాడన్న వేదన... పల్లె నుంచి పట్నాలకీ, పట్నాల నుంచి నగరాలకీ పరిగెడుతూ పోటీ పడుతూ అందని అంతస్తుల కోసం మమతలకూ, మమకారాలకూ, అనుబంధాలకూ ఇన్‌స్టాల్‌మెంట్‌ల వారీ గా చెల్లుచీటీ రాస్తున్న తరం... ముందుకు వెళుతున్నామా, వెనక్కా? ఈ పరుగులు ఎటు? అని మథన పడుతూ తిరు గు ప్రయాణమైన కథకుడిని చేపలచెరువులైపోయిన పొ లాల మీంచి పొలుసు వాసన వెంటాడుతూనే ఉంటుంది. నేడు రైతు ఎదుర్కొంటున్న దుస్థితిని ఆనాడే (1994, మే మాసం రచన మాస పత్రిక) అంచనా వేసిన రచయిత దార్శనికత అద్భుతం. ''వ్యవసాయం గిట్టుబాటు కాని వృత్తి అయింది. రాబోయే రోజుల్లో మరీ కష్టం. విత్తనాలూ ఎరువులూ విదేశీ కంపెనీలు అమ్ముతాయి. ఈ సబ్సిడీలు గట్రా ఉండవు. ఇక ముందు మీరు కొనలేరు. అమ్మడానికి మీ దగ్గర ఏమీ ఉండదు. రాబోయే రోజుల్ల రైతు పరిస్థితి అదీ!'' అని ప్రధాన పాత్ర చేత రచయిత చెప్పించడం అద్భుతం. - గంటేడ గౌరునాయుడు కవీ, కథకుడూ, గాయకుడు కూడా అయిన గంటేడ గౌరునాయుడు 'కళింగాంధ్ర ఉచ్ఛ్వాస నిశ్వాసలను కథనం చేస్తున్న రచయిత.' మూడు కవితా సంపుటులూ, రెండు కథా సంకలనాలను అచ్చేశారు. 1984 నుంచీ కథలు రాస్తున్న గంటేడ, చాసో అవార్డు, రా.వి.శాస్త్రి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సత్కారం అందుకున్న రచయిత. అట్టడుగు ప్రజల జీవిత సత్యాలనే ఇతివృత్తాలుగా తీసుకురాసే అట్టాడ అప్పల్నాయుడు కథ 'మమకారం' ఇక్కడ పరిచయం చేసినందుకు గౌరునాయుడుకు కృతజ్ఞతలు.

No comments:

Post a Comment